utham kumar reddy: కోదండరాం కొత్త పార్టీ పెడతారని నేను అనుకోవడంలేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ సర్కారు అవలంబిస్తోన్న పలు విధానాలపై పోరాడుతున్న తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొ.కోదండరాం కొత్త పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే పార్టీలకు, ప్రజా సంఘాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలపడాలని సూచించారు. ఈ కోణంలోనే తాము ఆలోచించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్రకు మద్దతు పలికామని అన్నారు.
గత ఎన్నికల్లో తాము తెలంగాణలోని యువత ఓట్లను పొందలేకపోయామని వ్యాఖ్యానించారు. ఇకపై తాము యువతపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని అన్నారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంపైనే తమకు సూచనలు చేశారని, యూపీలో వచ్చేనెలలో జరగనున్న ఎన్నికల అనంతరం ఆయన తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా గర్జన సభ నిర్వహిస్తామని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించిన ఐటీఐఆర్ రాబట్టడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని, ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర సర్కారు దగ్గర ఎందుకు గొంతు ఎత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.