: మలుపు తిరిగిన గౌతమి మృతి కేసు... అది హత్య అంటున్న చెల్లెలు!
గత బుధవారం జరిగిన రహదారి ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన దంగేటి గౌతమి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. పాలకొల్లు మండలం దిగమర్రు వద్ద ఆమె తన చెల్లెలు పావనితో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పావని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. నరసాపురానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారితో తన అక్కకు ఏడాది క్రితమే పెళ్లయిందని... దీంతో, అతని మొదటి భార్య ఇప్పటికే తన అక్కను ఎన్నోసార్లు బెదిరించిందని తెలిపింది.
అక్కకు ఒంట్లో బాగోలేకపోవడంతో పాలకొల్లులోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుని, తిరిగి వస్తుండగా ఓ వాహనం తమను వెంబడించిందని... దిగమర్రు వద్దకు వచ్చేసరికి తమను వేగంగా ఢీకొందని చెప్పింది. అక్కపై నుంచి వెళ్లిన వాహనం, తనను కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లిందని తెలిపింది. కొంతదూరం వెళ్లాక ఆ వాహనం కూడా అదుపుతప్పి కాలువలోకి పడిపోయిందని చెప్పింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయానని తెలిపింది.
తన అక్కను పెళ్లి చేసుకున్న వ్యక్తి తొలి భార్యనే తన డ్రైవర్ తో ఈ పని చేయించిందనేది తన అనుమానమని చెప్పింది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకుంది. తమను ఢీకొన్న వాహనంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నట్టు అనిపించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం వెనుక హత్య కోణం ఉందా? అనే అనుమానం కూడా వస్తోంది. పోలీసులు కూడా ఈ కోణంలో సైతం దర్యాప్తును ప్రారంభించారు.