: జల్లికట్టు ఉద్యమానికి, ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు: సీఎం చంద్రబాబు
తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతున్న జల్లికట్టు ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు పోలిక ఏమిటో తనకు అర్థం కావట్లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జల్లికట్టు పోరాటం నేపథ్యంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పవన్ కల్యాణ్ సహా పలువురు వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన ఈ రోజు అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పర్యటన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధే తనకు ముఖ్యమని, కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేసినవారే తనకు ఇప్పుడు పలు లేఖలు రాస్తుండడం తనకు విచిత్రంగా అనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. తాను రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు విషయంలో రాజీపడబోనని, తనపై నమ్మకం ఉంచే ప్రజలు తనకు అధికారాన్ని కట్టబెట్టారని, దానిని నిలబెట్టుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని అన్నారు. కులాలు ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడం కొందరికి అలవాటుగా మారిపోయిందని అన్నారు. విశాఖపట్నానికి భవిష్యత్తు ఉందా? అనే అనుమానాలు ఉన్న సమయంలో ఆ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.