chandrababu: డిజిటల్ కరెన్సీపై కూడా దావోస్‌లో చర్చ జరిగింది: ముఖ్యమంత్రి చంద్రబాబు
దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పర్యటన వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రపంచ దేశాలను ఆకర్షించడం తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు. అందరూ ఒకచోట కొలువుదీరి వారి ఆలోచనలను పంచుకునే వేదికే దావోస్‌లో జరిగిన సదస్సు అని ఆయన అన్నారు. ఆ సదస్సులో ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని అన్నారు. సాధారణంగా ఇంతమందిని కలవాలంటే కొన్నేళ్లు పడుతుందని, ఇదొక సమావేశం కావడం వల్ల ఒకేచోట అంతమందిని కలుసుకున్నానని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్, ఆటో మొబైల్ రంగాల అభివృద్ధిపై ముఖ్యంగా చర్చించామని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సంపద కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ కరెన్సీపై కూడా దావోస్‌లో చర్చ జరిగిందని ఆయన అన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలిశానని అన్నారు. శ్రీలంకలో పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని తాను పలువురిని ఆహ్వానించానని అన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలుగల రాష్ట్రంగా ఏపీ ఉంటుందని తెలిపారు.