: తంబీలే ఆదర్శం... కదులుతున్న తెలుగుయువత!
జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కోసం ఉద్యమించిన తమిళ తంబీల స్ఫూర్తితో, ప్రత్యేక హోదా కోసం తెలుగు యువత కదులుతోంది. ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు తరహా ఉద్యమానికి అందరూ కదలిరావాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, విజయవాడలోని కృష్ణానది దిగువ తీరం, తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణాలు ఇందుకు వేదికని, ప్రతి ఒక్కరూ 26వ తేదీన రావాలని, శాంతియుత నిరసనలు, ఆందోళనా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా హోదా కోసం ఉద్యమం కొనసాగిస్తే, కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే తమిళుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. యువత ఉద్యమిస్తే, తాను అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ సైతం యువత ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పటికే ఓ లేఖ రాశారు. విభజన చట్టం అమలుకు పోరాడదామని, అందుకు కలసిరావాలని అభ్యర్థించారు. ఇప్పటికే తాము కోటి సంతకాల ఉద్యమం చేశామని ఆయన గుర్తు చేశారు.
ఇక వైకాపా పలు నగరాల్లో హోదా సాధన కోసం 'యువభేరీ' కార్యక్రమాలను నిర్వహించగా, పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న నిరసనలకు యువత కదిలితే, వైకాపా నేతలు కదలి వెళ్లాలని, యువతకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చోవాలని జగన్ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమ మాదిరిగానే, తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతూ నిరసన వేదికల వద్దకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని, 26న నిరసనల ఆలోచనలను చంద్రబాబు సర్కారు నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. వీటి వెనుక ఎవరున్నారన్న కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నట్టు సమాచారం.