pawan kalyan: రైలు ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది: పవన్ కల్యాణ్
విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇటువంటి ఘోర ప్రమాదాలు జరగడం శోచనీయమని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 100 మంది క్షతగాత్రులు కావడం ఎంతో దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఈ ప్రమాదం కారణంగా నష్టపోయిన వారిని సర్కారు వెంటనే ఆదుకోవాలని పవన్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతో పాటు గాయాల పాలయిన వారికి తగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని ఆయన అన్నారు. ఇటువంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.