: తమిళ సినీనటులు ప్రజలకు అండగా ఉంటే.. తెలుగు హీరోలు కోట్లు కొల్లగొట్టుకుపోతున్నారు: చలసాని శ్రీనివాస్
జల్లికట్టు క్రీడకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో అగ్ర సినీనటులు మొన్న జరిగిన ఆందోళనలో పాల్గొన్న విషయం తెలిసిందే. తమిళనాడు ఇచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా కోసం సినీపరిశ్రమ మద్దతు తెలపాలని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. తెలుగు సినీ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించారని.. కానీ, సదరు హీరోలు మాత్రం రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమిళ సినీ నటులు ప్రజలకు అండగా నిలబడి పోరాడుతుంటే తెలుగు హీరోలు మాత్రం సినిమాలతో కోట్లు కొల్లగొట్టుకుపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇచ్చే ముష్టిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.