: తన ఫేస్‌బుక్ పేజీకోసం బెల్జియం నుంచి నేరుగా అమెరికాకు వెళ్లిపోయిన యువతి!
బెల్జియంకు చెందిన 23 ఏళ్ల జమిలా బైదు అనే యువతి తన ఫేస్‌బుక్ అకౌంట్ కోసం ఏకంగా అమెరికా వరకు వెళ్లిపోయింది. బ్లాక్ అయి పోయిన తన ఫేస్‌బుక్ పేజీని పునరుద్ధరించుకునేందుకు ఆమె నేరుగా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌నే కలవడానికి అక్కడికి వెళ్లింది. అందుకోసం అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయానికి చేరుకోనుంది. సంగీతంలో రాణించే జమిలా బైదు, ఫేస్‌బుక్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన సంగీత వీడియోలను ఆ సైట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు తన ఫేస్‌బుక్ పేజీలో లక్షా 57వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అయితే, ఆరు నెలలుగా ఆమెపై ఒక దుండగుడు మరో పేజీలో అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జమిలా ఇప్పటికే సదరు వ్యక్తిని హెచ్చరించింది. అనంతరం ఫేస్‌బుక్ సంస్థకు ఫిర్యాదు చేసింది. ఆమె నుంచి ఫిర్యాదు అందుకున్న ఫేస్‌బుక్ కంపెనీ ఆమె ఊహించని విధంగా ఆమె ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధించిన ఫేస్‌బుక్ పేజ్‌తో పాటు ఆమె పేజీని కూడా బ్లాక్ చేసింది. దీంతో ఆవేదనకు గురైన జమిలా తనకు సంబంధించిన వీడియోలు, పోస్టులు తన లక్షల మంది ఫ్యాన్స్‌ను కోల్పోకుండా ఉండేందుకు మొదట తమ దేశంలో ఉన్న ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సంప్రదించింది.
దీంతో బెల్జియం దేశంలోని ఫేస్‌బుక్ కార్యాలయం ఆమె పేజీని తిరిగి ఓపెన్ అయ్యేలా చేసింది. అయితే, జమిలాకు సంబంధించిన పాత పోస్టుల సమాచారం అందులో కనపడలేదు. దీంతో ఆమె తన మిత్రుడి సలహా మేరకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఆ యువతి అక్కడ ఫిర్యాదు చేయనుంది.