: ఢిల్లీ స్కూల్లో టీచర్ ను వాష్ రూంలో బంధించి, బెదిరింపులకు దిగిన విద్యార్థి!
దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో 'సర్వోదయ విద్యాయ్' స్కూల్లో ఓ మహిళ (44) టీచర్ గా పని చేస్తోంది. ఆ స్కూల్ మధ్యలో ఆమె వాష్ రూమ్ కు వెళ్లింది. దీనిని గమనించిన స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ కుర్రాడు బయటి నుంచి గడియ పెట్టాడు. దీనిని గమనించిన ఆమె ఆ తలుపు తీసేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న ఆ కుర్రాడు 'తాను చెప్పినట్లు వింటేనే తలుపు తెరుస్తా' అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బిత్తరపోయిన ఆమె తీవ్రమైన ఆందోళనకు గురైంది.
దీంతో 'అతను చెప్పినట్టే చేస్తానని' చెప్పడంతో బయటున్న వ్యక్తి తలుపు తెరిచాడు. వెంటనే బయటపడ్డ ఆమె బయటకి వస్తూనే గట్టిగా కేకలు వేసింది. దీంతో సదరు కుర్రాడు పరుగులంకించుకున్నాడు. వెంటనే ఆమె స్కూల్ యాజమాన్యానికి విషయం వివరించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్ లో ఉన్నవారిని అసెంబ్లీలో హాజరుపరిచి గుర్తుపట్టాలని సూచించారు. అయితే విద్యార్థిని గుర్తుపట్టలేకపోయిన ఆమె, టెన్షన్ లో అతని ముఖం సరిగ్గా చూడలేదని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, త్వరలోనే ఆ కుర్రాడిని పట్టుకుంటామని తెలిపారు.