: రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులు జరపవచ్చు: నిఘావర్గాల హెచ్చరిక
మరో వారం రోజుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నెల 26న ఢిల్లీలోని కోర్టులపై ఉగ్రవాదులు దాడులకు దిగడానికి స్కెచ్ వేసినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపాయి. కొన్నిరోజులుగా ఎవరికీ చిక్కుకుండా ఢిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు ఈ దాడులకు దిగవచ్చని తెలిపాయి. ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని మార్చుకుని కోర్టులతో పాటు పలు ప్రాంతాల్లో దాడులకు దిగడానికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలపై స్పందించిన ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ... రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.