: బరువు పెరిగారు కదా.. వెళ్లి గ్రౌండ్ డ్యూటీ చేసుకోండి!: ఎయిర్ హోస్టెస్ లకు ఎయిర్ ఇండియా తాఖీదు
క్యాబిన్ క్రూ సిబ్బందిగా పని చేస్తున్న 57 మంది ఉద్యోగులపై ఎయిర్ ఇండియా కొరడా ఝుళిపించింది. విమానంలో పనిచేయడానికి మీరంతా పనికి రారని... వెళ్లి గ్రౌండ్ డ్యూటీ చేసుకోవాలంటూ ఆదేశించింది. వీరి బదిలీకి కారణం వీరంతా బరువు పెరగడమే. వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టెస్ లు కావడం విశేషం. త్వరలోనే మీరంతా బరువు తగ్గాలని... లేకపోతే శాశ్వతంగా గ్రౌండ్ డ్యూటీకే పరిమితం చేస్తామని హెచ్చరించింది.
బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎమ్ఐ) ప్రకారం వీరంతా అధిక బరువును కలిగి ఉన్నారని గుర్తించామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. క్యాబిన్ క్రూ నుంచి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ అయితే ప్రతి నెలా రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు ఫ్లయింగ్ అలవెన్స్ ను వీరు కోల్పోతారు. అధిక బరువు కలిగిన వారిని తొలుత ఆరు నెలల పాటు క్యాబిన్ క్రూ జాబ్ కు అన్ ఫిట్ గా ప్రకటిస్తారు. 18 నెలల్లోగా వీరు తమ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే, పర్మినెంట్ గా గ్రౌండ్ డ్యూటీకే పరిమితం చేస్తారు.