: అమెరికాలో నేటి నుంచి ట్రంప్ శకం.. ప్రమాణ స్వీకారానికి 9 లక్షల మంది హాజరు.. రాబోమన్న 50 మంది డెమోక్రాట్లు
అమెరికాలో నేటి నుంచి ట్రంప్ శకం ప్రారంభం కానుంది. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్థానిక కాలమానం ప్రకారం నేటి (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు, భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 10.30 గంటలకు రెండు బైబిళ్లపై ప్రమాణం చేసి అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. యూఎస్ క్యాపిటల్ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌తో ప్రమాణం చేయిస్తారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హిల్లరీ క్లింటన్, ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ హాజరయ్యే అవకాశం ఉంది. పలువురు ప్రముఖులు సహా 9 లక్షల మంది వరకు వస్తారని అంచనా. 2008లో ఒబామా ప్రమాణ స్వీకారానికి 18 లక్షల మంది వాషింగ్టన్ చేరుకున్నారు. కాగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి లక్షలాది మంది వస్తుంటే 50 మంది డెమోక్రాట్లు మాత్రం తాము రాబోమని తేల్చి చెప్పారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా 30 మంది భారతీయ కళాకారుల బృందం ప్రదర్శన ఇవ్వనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ఊరేగింపుగా వైట్‌హౌస్‌కు చేరుకుంటారు.