: తప్పుమీద తప్పులు చేస్తున్న అమెజాన్.. మొన్న మువ్వన్నెల జెండా డోర్ మ్యాట్లు , నిన్న గాంధీ చెప్పులు, నేడు వినాయకుడి స్కేటింగ్ బోర్డులు!
ఈ కామర్స్ ప్రముఖ సంస్థ అమెజాన్ తప్పుమీద తప్పు చేస్తోంది. భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇటీవల జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్‌మ్యాట్లను సైట్‌లో అమ్మకానికి పెట్టిన సంస్థ ఆ తర్వాత మహాత్మాగాంధీ ఫొటో ముద్రించిన చెప్పులను వెబ్‌సైట్‌లో పెట్టింది. ఇప్పుడు ఏకంగా వినాయకుడి బొమ్మలున్న స్కేటింగ్ బోర్డులను సైట్‌లో పెట్టింది. అమెజాన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
చండీగఢ్‌కు చెందిన న్యాయవాది అజయ్ జగ్గా వినాయకుడి స్కేటింగ్ బోర్డులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా తెలియజేశారు. వెంటనే వెబ్‌సైట్ నుంచి వాటిని తొలగించి ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. అమెజాన్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. మరోవైపు అమెజాన్ తీరును కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయుల మనోభావాలను దెబ్బతీయకుండా నడుచుకుంటే మంచిదని హెచ్చరించారు.