: నేను.. సిద్ధూకు వికెట్ కీపర్ ను!: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్
బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన విషయం విదితమే. అయితే, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ కు, సిద్ధూకు మధ్య సఖ్యత కొరవడిందనే ఆరోపణలు హల్ చల్ చేశాయి. ఈ ఆరోపణలకు తెరదించుతూ వాళ్లిద్దరూ కలిసి సంయుక్తంగా అమృత్ సర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ, తండ్రి ఎప్పటికీ తండ్రేనని, కొడుకు ఎప్పటికీ కొడుకేనని అన్నారు.
అనంతరం, అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, తాను.. సిద్ధూకు వికెట్ కీపర్ నని, పడిపోబోతే పట్టుకుంటానని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అధికార అకాలీదళ్-బీజేపీలకు కేవలం 10 నుంచి 20 సీట్లే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సిద్ధూ చేరే ముందు ఎలాంటి షరతులు పెట్టలేదని అన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లపై ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు. ‘‘ఆప్’ మీకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసిందా?’ అనే ప్రశ్నకు సిద్ధూ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. ‘పంజాబ్ లో అమరీందర్ సింగ్ మీకు కెప్టెనా?’ అనే ప్రశ్నకు సిద్ధూ సమాధానం చెప్పకపోవడం గమనార్హం.