: ‘జగన్ గో బ్యాక్’ అంటూ వైసీపీ అధినేతకు షాక్ ఇచ్చిన అమరావతి రైతులు
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. నిడమర్రు, లింగాయపాలెం ప్రాంతాల్లో ఆయన రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను గురించి తెలుసుకుంటున్నారు. అయితే, అమరావతి ప్రాంతంలో జగన్కు ఊహించని షాక్ తగిలింది. ఆయన పర్యటనను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. ‘జగన్ గో బ్యాక్’అంటూ కురగల్లులో రైతులు కట్టిన బ్యానర్లు కనిపించాయి. రైతుల్లో విషబీజాలు నాటేందుకే జగన్ పర్యటిస్తున్నారని రైతుల పేరిట ఏర్పాటు చేసిన ఆ బ్యానర్లలో ఉంది.
మురోవైపు మంగళగిరి మండలంలోని కురగల్లుతో పాటు ఎర్రబాలెం గ్రామాల్లో జగన్ పర్యటనను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు, రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రైతుల నిరసనల మధ్యనే జగన్ తన పర్యటనను కొనసాగించారు. తన పర్యటనలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఏపీ రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టిందని, భూసేకరణ పేరుతో రైతులవద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. రూ.15 కోట్లు పలికే ఎకరం భూమికి గానూ రైతులకు కేవలం రూ. 30 లక్షలు ఇస్తోందని అన్నారు.