demonitisation: మరో ఘటన... వెయ్యి రూపాయలు ఎంటర్ చేస్తే నాలుగు వేలు ఇచ్చేస్తున్న ఏటీఎం


రాజస్థాన్‌ లోని టోంక్ లో జితేష్ దివాకర్ అనే వ్యక్తి ఏటీఎం నుంచి 3,500 రూపాయలు డ్రా చేస్తే అందులోంచి ఏకంగా 70 వేలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అసోంలోని జమునాముఖ్ ప్రాంతంలోనూ అటువంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న‌ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)కు చెందిన ఓ ఏటీఎం ఖాతాదారులు డ్రా చేసిన డ‌బ్బు కంటే నాలుగు రెట్ల ఎక్కువ మొత్తాన్ని ఇచ్చింది. ఈ విష‌యం బ్యాంకు అధికారుల దృష్టికి వ‌చ్చేలోపు ఆ ఏటీఎం నుంచి ప‌లువురు ఖాతాదారులు ఏకంగా ఏడు లక్షల రూపాయల మొత్తాన్ని తీసేసుకున్నారు.

ఏటీఎం నుంచి డ్రా చేసిన దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ‌గా డ‌బ్బు వ‌స్తోంద‌ని తెలుసుకున్న జ‌నం ఏటీఎం వ‌ద్ద‌కు ప‌రుగులు పెట్టి అందులోని డ‌బ్బంతా డ్రా చేసుకున్నారు. సిస్టంలో త‌లెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని ఆ బ్యాంకు మేనేజర్ కృష్ణ భౌమిక్ తెలిపారు. ఈ విష‌యంపై ఆయ‌న మాట్లాడుతూ... ఏటీఎంలోని స్లాట్‌లలో 500, 2000 రూపాయల నోట్లు పెట్టామని చెప్పారు. ఓ ఖాతాదారుడు వెయ్యి రూపాయలు కావాలని అందులో ఏటీఎం మిష‌న్‌లో ఎంటర్ చేస్తే ఆయ‌న‌కు రెండు 500 రూపాయల నోట్లకు బదులుగా రెండు 2000 రూపాయల నోట్లు వచ్చాయని చెప్పారు. ఈ విషయాన్ని తాము ఇప్ప‌టికే పోలీసులకు తెలిపామ‌ని, అయితే, అధికారికంగా మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయ‌న అన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాలా? వద్దా? అన్న విషయం కోసం త‌మ‌ ఉన్నతాధికారులను సంప్రదించామని తెలిపారు. ఏటీఎం నుంచి ఖాతాదారులు ఎంతెంత డ్రా చేసుకున్నారో గుర్తిస్తామ‌ని, వారు అధికంగా తీసుకున్న డ‌బ్బుని తిరిగి వసూలు చేస్తామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News