: జల్లికట్టుపై దర్శకుడు లారెన్స్ సంచలన ప్రకటన.. ఆ పోరాటానికి కోటి రూపాయలైనా ఇస్తానని ప్రకటన
తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళనలకు తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు లారెన్స్ మద్దతు పలికారు. మెరీనా తీరంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను బుధవారం కలిసిన ఆయన వారితో కలిసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. పోరాటంలో పాల్గొన్న వారి ఆకలిదప్పులు తీర్చేందుకు అయిన ఖర్చును తాను భరిస్తానని, కోటి రూపాయలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. జల్లికట్టు కోసం ఒక్కటైన తమిళులకు చిత్రపరిశ్రమ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. జల్లికట్టు తమిళ సంప్రదాయానికి అద్దంపట్టే క్రీడ అనీ, కొన్ని విదేశీ శక్తులు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, వాటిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల పోరాటాన్ని చూసైనా కేంద్రం దిగివస్తుందన్న నమ్మకం ఉందని లారెన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.