: ప్రపంచంలోని అగ్రశ్రేణి మ్యూజియంలను తలదన్నేలా.. అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం!
ప్రపంచంలోని అగ్రశ్రేణి మ్యూజియంలను తలదన్నేలా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్ణయించింది. అంతేకాదు దానిని అతిపెద్ద సందర్శనీయ సముదాయంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యూరప్, అమెరికాలోని అంతర్జాతీయ మ్యూజియంలతోపాటు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మ్యూజియంను సందర్శించిన ట్రస్ట్ సభ్యులు వాటిని అధ్యయనం చేశాక నిర్మించబోయే మ్యూజియంలో ఏమేమి ఉండాలన్న అంశాలపై చర్చించారు.
ఒక్క మ్యూజియంగా కంటే మ్యూజియం-గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని భావించారు. ఈ ఏడాదిలోనే మ్యూజియంకు శంకుస్థాపన చేసి మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం పదెకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తారు. మ్యూజియంలో ఎన్టీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, సినీ, రాజకీయ రంగాలపై ప్రత్యేకంగా గ్యాలరీలు ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ ఫొటోలు, రాతి శిల్పాలు, త్రీడీ బొమ్మలు ఏర్పాటు చేస్తారు. దక్షిణ భారతదేశ చలనచిత్ర చరిత్రను వివరించే పుస్తకాలు, ఫొటోలు, వీడియోలు ఇందులో భద్రపరుస్తారు. కనీసం రెండువేల మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం నిర్మిస్తారు.