: మోదీజీ, పది రోజులే గడువు... 'జవాన్ వీడియో' ఉదంతంపై అల్టిమేటమ్ ఇచ్చిన 51 గ్రామాల ప్రజలు!
బీఎస్ఎఫ్ జవాన్లకు దారుణమైన భోజనం పెడుతున్నారంటూ బాహ్య ప్రపంచానికి వీడియో ద్వారా తెలియజేసిన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఘటనపై సీబీఐ దర్యాప్తు లేదా సిట్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని 51 గ్రామాలకు చెందిన ప్రజలు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తేజ్ బహుదూర్ యాదవ్ సొంత రాష్ట్రమైన హర్యాణాలోని ఆయన గ్రామానికి సమీపంలోని మహేంద్రగఢ్ లోని రత్నకల్యాణ్ గ్రామంలో మహాపంచాయతీ నిర్వహించారు. ఇందులో చుట్టుపక్కల 51 గ్రామాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పది రోజుల గడువు ఇస్తున్నామని, స్పందించని పక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. కాగా, తేజ్ బహుదూర్ వీడియోపై దర్యాప్తు చేసిన కేంద్ర హోంశాఖ, బీఎస్ఎఫ్ అధికారులు సైన్యానికి ఇచ్చే ఆహారం బాగానే ఉందంటూ ప్రధాని మోదీకి నివేదికలు ఇచ్చిన సంగతి తెలిసిందే. జవాన్ తేజ్ బహదూర్ ను తాగుబోతుగా, అన్ డిసిప్లిన్డ్ వ్యక్తిగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై వారు మండిపడుతూ, తేజ్ బహుదూర్ పై వేధింపులకు దిగవద్దని సూచించారు.