: కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసిన ఈ ఏడుగురూ ఇప్పుడు ఇండియాలో కుబేరులు!


చిన్న వయసులో చదువుకోవడం లేదని మీ నాన్న ఎన్నడైనా మందలించడం మీకు గుర్తుందా? చక్కగా చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని బుద్ధులు చెప్పారా? కచ్చితంగా చెప్పేవుంటారు. కానీ కొందరు మాత్రం ఉన్నత చదువులు చదవకుండానే ధనవంతులుగా మారారు. వారసత్వంగా వచ్చిన సంపదను ఇబ్బడి ముబ్బడిగా మార్చారు. కనీస విద్యార్హతలు లేని వీరు, ఇప్పుడు దేశంలోని అత్యంత ధనవంతుల్లో కొందరు... వారిలో ఏడుగురు ప్రముఖుల వివరాలివి.

ముఖేష్ అంబానీ: ఇండియాలో అత్యంత ధనవంతుడు, ఆసియాలోని అత్యంత ధనికుల్లో 2వ వాడు. ఇక ప్రపంచం మొత్తం మీద లెక్కకు వస్తే, ఇతనిది 22వ ర్యాంకు. ముఖేష్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో కాలేజీ విద్యను అభ్యసిస్తూ, తన తండ్రి వ్యాపారంలో చేరేందుకు చదువును మధ్యలోనే మానేశాడని తెలుసా?

అజీం ప్రేమ్ జీ: ఇండియాలో మూడవ అత్యంత ధనవంతుడిగా, ఐటీ దిగ్గజం విప్రోకు చైర్మన్ గా ఉన్న అజీం ప్రేమ్ జీ సైతం కాలేజీ విద్యను మధ్యలో వదిలేశారని తెలుసా? 1966లో కాలిఫోర్నియాలో చదువుతున్న అజీం, తన తండ్రి హఠాన్మరణంతో, 21 ఏళ్ల వయసులో చదువును ఆపేసి వచ్చి వ్యాపార నిర్వహణను స్వీకరించారు. ఆపై మూడేళ్ల తరువాత తన విద్యను కొనసాగించారు.

సుభాష్ చంద్ర: పదవ తరగతిలోనే చదువును ఆపేశారు. ఫైడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బియ్యాన్ని సరఫరా చేసే కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించేందుకు కమిషన్ ఏజంట్ గా పనిచేస్తూ, అంచెలంచెలుగా పైకి ఎదిగి, జీ మీడియాను స్థాపించారు. గత సంవత్సరం హర్యానా నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

గౌతమ్ అదానీ: ఇండియాలోని అతిపెద్ద ఎగుమతి దిగుమతి సంస్థ అదానీ గ్రూప్ చైర్మన్ గా ఉన్న గౌతమ్ కూడా కాలేజీ విద్యను పూర్తి చేయలేదు. గుజరాత్ యూనివర్శిటీలో బీకామ్ రెండో సంవత్సరం చదువును ఆపేసి ఓ డైమండ్ సంస్థలో పనికి చేరారు.

ముకేష్ జగిత్యాని: దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ల్యాండ్ మార్క్ గ్రూప్ వ్యవస్థాపకుడైన ముకేష్ లండన్ లోని ఓ బిజినెస్ స్కూల్ లో ఎకనామిక్స్ విద్యను మధ్యలోనే ఆపేశారు. ఆయన స్థాపించిన కంపెనీ ఇప్పుడు ఇండియా, చైనా, పాకిస్థాన్, స్పెయిన్, గల్ఫ్ దేశాల్లో 600 స్టోర్లను నిర్వహిస్తోంది.

పీఎన్సీ మీనన్: ప్రముఖ నిర్మాణ సంస్థ శోభా డెవలపర్స్ యజమాని పుతన్ నెడువక్కట్ చెంతమారక్ష మీనన్ డిగ్రీ పూర్తి చేయకుండానే వ్యాపారంలో కాలుమోపారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఇప్పుడు వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు.

వినోద్ గోయంకా: సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేశారు. డీబీ రియాల్టీ సంస్థను ప్రారంభించి విజయవంతమయ్యారు. ఇండియాలో సంచలనం సృష్టించిన 2జీ స్కామ్ లో పేరుండటం వినోద్ గోయంకా జీవితంలో ఓ మాయని మచ్చ.

  • Loading...

More Telugu News