: చిరిగిన కుర్తా జేబు చూపించిన రాహుల్ గాంధీ... నవ్వాపుకోలేక పోతున్న నెటిజన్లు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లకు టార్గెట్ గా మారారు. చిరిగిన కుర్తాను చూపించిన రాహుల్ పై జోకుల మీద జోకులు పేలుతున్నాయి. రాహుల్ వైఖరి, ఆయన తన చిరిగిన జేబును చూపించిన వైనాన్ని చూసి నవ్వాపుకోలేక పోతున్నామని పలువురు అంటున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన ప్రసంగిస్తూ, తన కుర్తా జేబులో చెయ్యి పెట్టి, అది చిరిగిపోయి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.
"నా కుర్తా జేబు చిరిగింది. ఏమీ ఫర్వాలేదు. కానీ, మోదీ ఎన్నడైనా చిరిగిపోయిన దుస్తులు ధరించారా? తాను పేదలకు ప్రతినిధినని చెప్పుకునే ఆయన, పేదలపై రాజకీయాలు చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాహుల్ వ్యాఖ్యలపై జోకులు పేలుతున్నాయి. రాహుల్ గతంలో సూట్లను ధరించిన ఫోటోలు, చార్టెడ్ విమానాల్లో తిరుగుతున్న ఫోటోలను పెడుతూ, ఆయన వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విదేశాల్లో రాహుల్ గడిపిన చిత్రాలను పోస్టు చేస్తున్నారు.
'కొత్త కుర్తా కొనుక్కోవడానికి డబ్బుల్లేవుగానీ, విదేశాల్లో సెలవులు గడిపేందుకు డబ్బుంటుందా?' అని ఒకరు, 'పేదవాడినని చెప్పుకోవడానికి సిగ్గుండాలి' అని మరొకరు, 'రాహుల్ కుర్తా కొనుక్కునేందుకు తలా ఒక రూపాయి విరాళం ఇద్దా'మని ఇంకొకరు... ఇలా సాగుతున్నాయి ఆయనపై సెటైర్లు.