: టీ20లో అద్భుతం... ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 6 వికెట్లు తీశాడు!


టీ20 క్రికెట్లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 6 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు సర్ఫరాజ్. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన టీ20 పోటీల్లో అతను ఈ ఘనత సాధించాడు. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో పయొనీర్స్ క్లబ్ తరపున ఆడిన సర్ఫరాజ్ సుడులు తిరిగే బంతులతో బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు. మెర్కారా క్రికెట్ క్లబ్ బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ స్పిన్ కు పెవిలియన్ కు క్యూ కట్టారు. మరో ఘనత ఏంటంటే..  ఐదు వరుస బంతుల్లో ఐదుగురు బ్యాట్స్ మెన్ ను ఔట్ చేశాడు.  వాస్తవానికి డబుల్ హ్యాట్రిక్ సాధించే అవకాశం కూడా అతనికి వచ్చింది. ఆరో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసినప్పటికీ... అంపైర్ నిరాకరించాడు. లేదా మరో అద్భుత రికార్డ్ అతని సొంతం అయుండేది.

మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ, పరుగులను కట్టడి చేయాలంటే దూకుడుగా బౌలింగ్ చేయడమే తన ఆలోచన అని చెప్పాడు. అదే తనకు వికెట్లను సాధించి పెడుతుందని తెలిపాడు. శ్రీలంక స్టార్ బౌలర్ మలింగ తరహాలో విభిన్నమైన యాక్షన్ తో బ్యాట్స్ మెన్ ను తికమక పెడతానని చెప్పాడు. సర్ఫరాజ్ బీహార్ రాష్ట్రం ముజఫరాబాద్ కు చెందిన వాడు. సయ్యెద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో జార్ఖండ్ తరపున ఆడాడు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఇంత వరకు భారత్-ఏ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. తన తాజా ప్రదర్శనతో సెలెక్టర్లు తనను గుర్తిస్తారని... ఈసారి భారత్-ఏ జట్టుతో పాటు, ఐపీఎల్ లో కూడా సత్తా చాటుతాననే ఆత్మవిశ్వాసాన్ని  వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News