: 'దంగల్' నటి జైరాకు ఒమర్ అబ్దుల్లా మద్దతు... జైరా రక్షణపై అసెంబ్లీలో చర్చ
'దంగల్' నటి జైరా వసీంకు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో జైరాపై కశ్మీరీ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. జైరా ఒక 16 ఏళ్ల బాలిక అని... ముఖ్యమంత్రి ముఫ్తీని కలిసిందనే కారణంతో ఆమె క్షమాపణలు చెప్పాలని బలవంతం చేయడం భావ్యం కాదని ఒమర్ అన్నారు. కశ్మీరీ యువతకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం జైరాకు ఎంతమాత్రం లేదని చెప్పారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ రైనా ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ, జైరాను దేశ వ్యతిరేక శక్తులు బెదిరిస్తున్నాయని... ఆమెకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వెంటనే డిప్యూటీ స్పీకర్ నజీర్ అహ్మద్ స్పందిస్తూ, రవీందర్ సూచనను పరిశీలించాలంటూ ప్రభుత్వానికి సూచించారు.