: 'దంగల్' నటి జైరాపై కశ్మీరీ యువత ఫైర్... క్షమాపణ చెప్పిన జైరా
అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా 'దంగల్'లో రెజ్లర్ గీతా ఫొగాట్ చిన్ననాటి పాత్రలో నటించిన జైరా వసీం కశ్మీరీ యువతకు క్షమాపణలు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే, సినిమా విజయం సాధించిన నేపథ్యంలో, కశ్మీరీ బాలిక జైరా వసీం (16)ను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పిలిపించుకున్నారు. శనివారం నాడు తన వద్దకు వచ్చిన జైరాను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సమావేశంపై కశ్మీరీ యువత తీవ్రంగా స్పందించింది. ఓవైపు కశ్మీరీ యువతపై దాడులు జరుగుతుంటే... సీఎంను జైరా కలవడం ఏంటంటూ ఫేస్ బుక్ లో ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో, తాను కొందరిని కలవడం చాలా మందిని బాధించిందని... వారందరికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని జైరా తెలిపింది. కశ్మీర్ లో గత ఆరు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పింది. అయితే తనను విమర్శించిన వారు కూడా తనను అర్థం చేసుకోవాలని... అన్ని పరిస్థితులను తాను నియంత్రించలేనని... తాను కేవలం 16 ఏళ్ల బాలికను అనే విషయాన్ని అర్థం చేసుకుని, తన పట్ల వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపింది.