: విజయవాడ బ్రాండ్ అంబాసడర్ గా కోనేరు హంపి!
చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ బ్రాండ్ అంబాసడర్ గా కోనేరు హంపి ఎంపిక అయింది. ఈ విషయాన్ని నగర మేయర్ కోనేరు శ్రీధర్ వెల్లడించారు. నగర సంబంధిత స్వచ్ఛతా యాప్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగంగా హంపి ప్రసంగాలు ఉంటాయని ఆయన తెలిపారు. విజయవాడ బ్రాండ్ అంబాసడర్ గా బాధ్యతలను స్వీకరించేందుకు ఒప్పుకున్న హంపికి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్-2017 కార్యక్రమానికి నగర ప్రజలందరూ సహకరించాలని విన్నవించారు.
ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ బృందం విజయవాడలో పర్యటించనుంది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాలను ఈ బృందం పరిశీలిస్తుంది. అంతేకాదు, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధిపై నగర ప్రజల నుంచి సూచనలను కూడా స్వీకరించనుంది. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో విజయవాడ 23వ స్థానానికి పరిమితమైంది. మైసూరు మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఈ ఏడాది విజయవాడను మొదటి స్థానంలో నిలపాల్సిన బాధ్యత విజయవాడ ప్రజలందరిపై ఉందని తెలిపారు.