: ఎలక్షన్ కమిషన్ 'సైకిల్'ను అఖిలేష్ కు కేటాయించడానికి కారణమిదే!
పార్టీని స్థాపించి, దశాబ్దాల పాటు నడిపించిన సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ను కాదని, ఆ పార్టీపై ఆధిపత్యాన్ని, ఎన్నికల గుర్తు 'సైకిల్'ను అఖిలేష్ యాదవ్ కు కేటాయిస్తూ, ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైకిల్ గుర్తును అఖిలేష్ వర్గానికే కేటాయించడం వెనుక అసలు కారణాలను అన్వేషిస్తే...
ఈసీ వర్గాల సమాచారం మేరకు మద్దతిస్తున్న ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర నేతల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉందన్నదే ప్రధానాంశం. ఈ విషయంలో తండ్రి ములాయంతో పోలిస్తే, అఖిలేష్ కు అధిక మద్దతు లభించింది. మొత్తం 228 మంది ఎంఎల్ఏలుండగా, 205 మంది అఖిలేష్ నాయకత్వాన్ని బలపరిచారు. ఇక 68 మంది ఎంఎల్సీల్లో 56 మంది, 24 మంది ఎంపీల్లో 15 మంది, 46 మంది జాతీయ కార్యవర్గ సభ్యుల్లో 28 మంది, 5731 మంది నేషనల్ కన్వెన్షన్ డెలిగేట్స్ లో 4,400 మంది అఖిలేష్ నాయకత్వాన్ని కోరుకుంటూ అఫిడవిట్లు దాఖలు చేశారు.
ఇదే సమయంలో ములాయం వర్గం నుంచి ఎలక్షన్ కమిషన్ కు ఏ విధమైన అఫిడవిట్లూ దాఖలు కాలేదు. పార్టీని తాను స్థాపించానని ఈసీకి చెప్పిన ములాయం, గుర్తు తనకే ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేశారు. ఇక ఈ పరిస్థితులను సమీక్షించిన ఈసీ, గతంలో ఇటువంటి సందర్భాల్లో ఏం చేశారన్న విషయాన్ని పరిశీలించి, పార్టీలో నేతల మద్దతు అధికంగా ఉన్న అఖిలేష్ కు సైకిల్ గుర్తును కేటాయిస్తూ, 46 పేజీల ఆర్డర్ ను వెలువరించింది.