: మా రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు.. పీయూసీ వరకు అందరికీ విద్య ఫ్రీగా ఇస్తున్నాం!: త్రిపుర సీఎం మాణిక్ సర్కార్
పేపర్ తిరగేస్తే చాలు.. ఎక్కడో ఓ చోట రైతు ఆత్మహత్యలపై వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఇదో రాజకీయ అంశం కూడా. అయితే త్రిపురలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ సోమవారం పేర్కొన్నారు. కర్ణాటకలోని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం మానవ అభివృద్ధి అధ్యయన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలిటికల్ ఎకానమీ ఆఫ్ త్రిపుర అనే సదస్సులో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
రెండు దశాబ్దాల క్రితం త్రిపురలో భూములన్నీ కొందరి చేతుల్లోనే ఉండేవని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేవి కావని గుర్తు చేశారు. కానీ నేడు వ్యవసాయ భూములు అందరికీ లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 97 శాతం అక్షరాస్యత సాధించడంతోపాటు వంద మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు. ప్రాథమిక విద్య నుంచి పీయూసీ వరకు విద్యార్థుల నుంచి పైసా కూడా వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. 90 శాతం ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుంటారని మాణిక్ సర్కార్ వివరించారు.