: చరిత్రను వక్రీకరించారు.. సక్రీకరించారు.. అని విమర్శలు చేస్తున్నారు.. అది సరికాదు!: శాతకర్ణి సినిమాపై సిరివెన్నెల
నందమూరి బాలకృష్ణను తండ్రిని మించిన తనయుడు అంటే బాగుంటుందని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... క్రిష్ కల బాలకృష్ణ ద్వారా ప్రపంచం చూస్తోందని అన్నారు. బాలకృష్ణ అద్భుతమైన నటనను కనబర్చారని అన్నారు. అతి తక్కువ చారిత్రక ఆధారాలు ఉన్న కథ శాతకర్ణి అని ఆయన అన్నారు. శాతకర్ణిని తెలుగువారికి మరోసారి గుర్తు చేశారని అన్నారు. చరిత్రను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను క్రిష్ తీశారని అన్నారు.
చరిత్రను వక్రీకరించారు.. సక్రీకరించారు.. అని పలువురు విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని అన్నారు. తాను ఈ సినిమాకి పాటలు రాయాల్సి వచ్చినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'ఆంధ్రప్రశస్తి'ని చదివానని, శాతకర్ణి గురించి అందులో ఉందని చెప్పారు. చక్రవర్తులందరిలో మిన్నయిన చక్రవర్తి శాతకర్ణి అని అందులో ఉందని, ఒక శకానికి ఆరంభకుడుగా పిలవదగిన వ్యక్తి శాతకర్ణి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆర్థికమైన విజయం సాధిస్తోందని, చారిత్రకమైన విజయం సాధించిన సినిమాగా కూడా నిలుస్తుందని చెప్పారు.