: నా కూతురి ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన త్రిష తల్లి
జల్లికట్టుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తమిళులు సినీనటి త్రిషకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన త్రిష తాను ట్విట్టర్‌లో జల్లికట్టుకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయలేదని, తన ఖాతాను హ్యాక్ చేశారని అన్నారు. ఈ క్రమంలో, ఈ రోజు త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఇదే విషయంపై చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన కూతురి ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. త్రిషను ఇబ్బందులకు గురి చేయాలనే గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేశారని ఆమె చెప్పారు. తమిళనాడులో సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టుకు తాము వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు.