: రజనీకాంత్ పై నేను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: శరత్ కుమార్
సినీనటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామని, ఆయనకు ప్రజల బాధల గురించి తెలియవని శరత్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారని తెలుసుకున్న రజనీ అభిమానులు శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి స్పందించిన శరత్ కుమార్... రజనీతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, అసలు తాను రజనీకాంత్కు రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదని అనలేదని చెప్పారు.
రజనీకాంత్ గురించి తనంతట తాను మాట్లాడలేదని శరత్ కుమార్ అన్నారు. తనవద్దకు వచ్చిన విలేకరులు తనను ఆ విషయంపై ప్రశ్నించడంతోనే స్పందించానని పేర్కొన్నారు. రజనీకాంత్ తనకు స్నేహితుడేనని చెప్పిన ఆయన.. ఒకవేళ రజనీ పార్టీ పెడితే మాత్రం ఆయనను ప్రత్యర్థిగా భావిస్తానని అన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించే వారు జన్మతః తమిళులే అవ్వాలన్నది తన ఉద్దేశమని తెలిపారు.