: చిరంజీవి ప్లెక్సీల ధ్వంసం... అభిమానుల నిరసనలతో కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
కృష్ణా జిల్లాలో చిరంజీవి ప్లెక్సీలను, వంగవీటి రంగా చిత్రాలున్న ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి ధ్వంసం చేయడంతో ఈ ఉదయం అటు చిరంజీవి అభిమాన సంఘాలు, ఇటు రంగా అభిమానులు రహదారులపై నిరసనలకు దిగారు. కైకలూరు మండలం అటపాకలో ఈ తెల్లవారుజామున ప్లెక్సీలను చించేసినట్టు తెలుస్తోంది. దీంతో భీమవరం - కైకలూరు రహదారిపై యువత ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, నిరసనలను విరమించేందుకు అభిమానులు ససేమిరా అంటున్నారు. దీంతో ఇంకా ఆందోళన కొనసాగుతుండగా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.