: 'ఆవు కథ' రాసినా పాసైపోతున్న టెక్కీలు... టెక్నాలజీ వర్శిటీల బాగోతం!


జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతపై ఎంత భరోసా ఉందంటే, తెల్లగా ఉన్న పేపర్ పై 'ఆవు కథ' రాసినా కనీస మార్కులతో పాస్ అయిపోతారు. ఏం రాశారన్నది పట్టించుకోకుండా మార్కులు వేసే పరిస్థితి నెలకొంది. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పట్టించుకోవడం లేదని పలు యూనివర్శిటీల ప్రొఫెసర్లు వాపోతున్నారు. వాస్తవానికి బీటెక్ చదివిన వారు ఇంకాస్త పట్టు సాధించగలిగితే, ఎంటెక్ లో పాస్ కావడం సులభమే. కానీ, తరగతులకు హాజరు కాకుండా, తెల్లగా ఉండే ఆన్సర్ షీట్లను నల్లగా మారిస్తే చాలు, పాస్ కావచ్చన్న అభిప్రాయం విద్యార్థుల్లోనూ నెలకొంది.

ధనార్జనే ధ్యేయంగా ఉన్న వర్శిటీల యాజమాన్యాలు, ల్యాబ్‌, ఇంటర్నల్స్‌లో మార్కులు స్వయంగా కేటాయించేలా ఉన్న నిబంధనలను అడ్డుపెట్టుకుని తమ వద్ద చేరే వారికి గట్టి భరోసాను ఇస్తుండగా, ఇదే అదనుగా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్న పరిస్థితి నెలకొంది. కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ యూనివర్శిటీల్లో డిస్టింక్షన్ తో పాసైన విద్యార్థుల సంఖ్యను చూస్తే అనుమానాలూ కలుగుతున్నాయి.

కాకినాడ పరిధిలో 2013 బ్యాచ్ ని పరిశీలిస్తే, 2774 మంది పరీక్షలు రాయగా 939 మందికి డిస్టింక్షన్ లభించింది. ఎంటెక్ విద్యార్థులకు తొలి సంవత్సరంలో మాత్రమే సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. సెకండ్ ఇయర్ లో ప్రాజెక్టు వర్క్ పూర్తి చేయాల్సి వుంటుంది. ఈ కారణాన్ని చూపే విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా దూరంగా ఉంటారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ, పలు వర్శిటీలను విచారించి, ఎంటెక్ విద్య, దాన్ని అభ్యసిస్తున్న విద్యార్థుల తీరు ఎంత ఘోరంగా ఉందో తేల్చి చెప్పింది.

విద్యార్థులకు తరగతి గది హాజరు నమోదుకు బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకురావడం, సిలబస్‌, ఇంటర్నల్స్‌, ల్యాబ్స్‌, ప్రాజెక్టు వర్క్‌ విధానంలో మార్పులు తేవడం, రెండో సంవత్సరంలో ఉపకార వేతనాల చెల్లింపును నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.

  • Loading...

More Telugu News