: వెంటాడి వేటాడిన కోహ్లీ సేన... తొలి వన్డేలో అద్భుత విజయం!
సత్తా చాటిన కోహ్లీ సేన... తొలి వన్డేలో అద్భుత విజయం.. శభాష్ టీమిండియా... శభాష్ కోహ్లీ సేన... ఆదివారం పుణె వేదికగా జరిగిన భారత్ - ఇంగ్లండ్ వన్డే మ్యాచ్ చూసిన వారు ఎవరైనా ఈ మాటలు అనక తప్పదేమో. 350 పరుగుల భారీ లక్ష్యం. 351 పరుగులు సాధిస్తేనే విజయం. అయితే ఏమి... కోహ్లీ సేన కలసికట్టుగా ఆడింది. కేవలం 48.1 ఓవర్లకే... మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయకేతనం ఎగురవేసింది. ఆదివారం పుణెలో జరిగిన మ్యాచులో తొలుత ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టి 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మన జట్టు 48.1 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ ఆటలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేదర్ జాదవ్ ఆట గురించే. జట్టుకు కీలకమైన సమయంలో గ్రేట్ వాల్ గా నిలబడి విజయం దక్కేలా చేసింది అతడే. 76 బంతుల్లో నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లతో 120 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జాదవ్ నే వరించింది. భారీ లక్ష్యం కళ్ల ముందుండగా బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు ధావన్ (1), రాహుల్ (8) వికెట్లను వెంట వెంట కోల్పోయింది. ఈ రెండు వికెట్లను తీసింది విల్లీ. భారీ సిక్సర్ తో శుభారంభాన్ని ఇచ్చిన యువరాజ్ సింగ్ సైతం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు.
మాజీ కెప్టెన్ ధోనీ సైతం ఆరు పరుగులకే అవుటయ్యాడు. ఇక ఈ సమయంలో కోహ్లీ కుదురుకోగా, జాదవ్ చెలరేగిపోయాడు. 29 పరుగుల్లోనే అర్ధ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 93 బంతుల్లో కోహ్లీ, 65 బంతుల్లో జాదవ్ సెంచరీలు పూర్తి చేసుకుని భారత విజయావకాశాలను నిలబెట్టారు. కోహ్లీ, జాదవ్ జోడీ టీ20 తరహాలో ప్రతీ ఓవర్ కు సగటున 8 పరుగులకు పైగా బాదుతూ ఇంగ్లండ్ ప్లేయర్లకు చెమటలు పట్టించారు. చివరికి వీరిద్దరూ వెంటవెంటనే అవుట్ కాగా, చివరగా హార్దిక్ పాండ్యా కీలకంగా మారాడు. 37 బంతుల్లోనే 40 పరుగులు చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. కాగా, మూడు వన్డేల సిరీస్ లో రెండో మ్యాచ్ ఈ నెల 19న కటక్ లో జరుగుతుంది.