: అమెరికాలో 'ఖైదీ నంబర్ 150', 'శాత‌క‌ర్ణి' సినిమాల‌కు కలెక్షన్ల వర్షం


తెలుగు అగ్ర న‌టులు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌ల ఖైదీ నంబ‌ర్ 150, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా బాక్సాఫీసు వ‌ద్ద కూడా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నాయి. అక్కడ ప్రదర్శితమవుతున్న మిగతా భాషల సినిమాల క‌న్నా అధికంగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతూ దూసుకుపోతున్నాయి.

ఈ రెండు తెలుగు సినిమాల‌తో పాటు ఇటీవ‌లే ప‌లు హిందీ సినిమాలు కూడా విడుద‌లైన విష‌యం తెలిసిందే. వాటిని సైతం వెన‌క్కునెట్టి  తెలుగు చిత్రాలు అమెరికా మార్కెట్ లో రికార్డు స్థాయిలో దూసుకెళుతున్నాయ‌ని ప్రముఖ బిజినెస్‌ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొంటున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా విడుద‌లైన‌ మొదటి మూడు రోజుల్లో రూ. 11.33 కోట్ల వసూళ్లు రాబట్టింద‌ని, 2 మిలియన్‌ డాలర్ల మార్క్ కు చేరువయిందని ఆయ‌న చెప్పారు. అదే విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం మొదటి రెండు రోజుల్లో రూ. 4.67 కోట్లు వ‌సూలు చేసింద‌ని ఆయ‌న అన్నారు.

మ‌రోవైపు శర్వానంద్ హీరోగా తెర‌కెక్కిన మ‌రో తెలుగు సినిమా ‘శతమానం భవతి’ కూడా ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచిన విష‌యం తెలిసిందే. విడుద‌లైన రోజున ఈ సినిమాకి రూ. 84.29 లక్షల కలెక్షన్లు వ‌చ్చాయ‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్  పేర్కొన్నారు. నిన్న‌టి, ఈ రోజు వసూళ్ల‌ను కూడా తీసుకుంటే  ఆ దేశ మార్కెట్ లో మ‌న‌ సినిమాలు రికార్డులు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News