: తమిళుల ఆకాంక్ష ముందు నిలవని చట్టాలు... జల్లికట్టు మొదలు
నిబంధనలు బేఖాతరయ్యాయి. స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళ తంబీలు పట్టించుకోలేదు. చట్టం కన్నా తమ ఆకాంక్షలు, సంప్రదాయాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. ఈ ఉదయం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ సూచకంగా పశువులకు పూజలు చేశారు. గిత్తలను సిద్ధం చేసి, వాటికి పసుపు, కుంకాలతో బొట్లు పెట్టి, కొమ్ములకు డబ్బులు కట్టి, వాటిని బరిలోకి వదిలేందుకు సిద్ధమయ్యారు.
నెల రోజుల పాటు జరిగే పోటీలకు నేడు పలు జిల్లాల్లో అంకురార్పణ జరగనుంది. జల్లికట్టు నిర్వహిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నా, వారి ఆంక్షలను పట్టించుకునేవారే కరవయ్యారు. తమిళనాడు ప్రభుత్వం, విపక్షాలు కూడా జల్లికట్టును జరిపించడానికే మొగ్గు చూపుతుండటంతో, పోలీసులు, అధికార యంత్రాంగం సైతం చూసీ చూడనట్టు ఊరుకోక తప్పని పరిస్థితి నెలకొంది.