amejan: మరోసారి దురహంకారం ప్రదర్శించిన అమెజాన్... గాంధీజీని తీవ్రంగా అవమానించిన ఈ-కామర్స్ వెబ్ సైట్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి భారతీయుల ఆగ్రహానికి గురయింది. ఇటీవలే జాతీయ పతాకంతో ఉన్న డోర్‌మ్యాట్లను తమ వెబ్‌సైట్‌లో ఉంచిన అమెజాన్ తీరుపట్ల విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేసి ఆ కంపెనీ ప్రతినిధుల వీసాలు రద్దు చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ డోర్‌మ్యాట్‌లను తమ వెబ్‌సైట్ నుంచి తొలగించిన అమెజాన్.. ఇప్పుడు మళ్లీ అటువంటి మరో విపరీత చర్యకు దిగింది. భారత జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మతో ఉన్న చెప్పులను తన అమ్మకాల జాబితాలో పెట్టింది. అమెజాన్.కామ్ వెబ్‌సైట్‌లో ‘గాంధీ ఫ్లిప్ ఫ్లాప్స్’ పేరిట వీటిని అమ్మకానికి ఉంచి, ఆ చెప్పుల ధర 16.99 డాలర్లుగా ప్రకటించింది.
ఏకంగా గాంధీజీ ఫొటోను ఇలా చెప్పులపై ముద్రించి మరోసారి భారత్‌ను అవమానపరిచి అహంకారం ప్రదర్శిస్తోన్న అమెజాన్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితమే ఆ సంస్థ చేసిన తప్పు పట్ల స్పందిస్తూ తీవ్రంగా హెచ్చరించిన సుష్మాస్వరాజ్ ఇప్పుడు ఈ చర్య పట్ల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఈ చెప్పుల ధర 16.99 డాలర్లుగా నిర్ణయించిన అమెజాన్ దాని డెలివరీ చార్జీ కింద మరో 2.99 డాలర్లను వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఒక భారతీయ నెటిజన్ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుష్మాస్వరాజ్‌లకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై తీవ్ర వివాదమే చెలరేగనుంది.