: బిలాయ్ లో రికార్డుల మోత.. ఒకే రోజు నమోదైన 9 ప్రపంచ రికార్డులు
చత్తీస్ గఢ్ లోని బిలాయ్ లో రికార్డుల మోత మోగింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, ప్రాణాయామ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆసనాలు వేసి 9 గోల్డెన్ బుక్ ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. 36 ఎకరాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షమందికిపైగా పాల్గొన్నారు. సూర్యనమస్కారాలు, అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభూతి ప్రాణాయామం చేసి మూడు ప్రపంచ రికార్డులు నమోదు చేయగా, ఒకేసారి లక్షమందికిపైగా యోగా నేర్చుకోవడం ద్వారా నాలుగో రికార్డు సొంతమైంది. పుషప్స్ ద్వారా ఐదో రికార్డు రాగా, రాజస్థాన్ కు చెందిన భాయ్ జైపాల్ అనే గురువు 141 నిమిషాల పాటు శీర్షాసనం వేసి ఆరో రికార్డు నెలకొల్పారు. భాయ్ రోతాస్ అనే వ్యక్తి 19 నిమిషాల 20 సెకన్లలో వెయ్యి పుషప్స్ చేసి ఏడో రికార్డు నెలకొల్పగా ఒకేసారి 50 వేల మంది సర్వాంగాసనం వేయడం ద్వారా 8, హలాసనాలు వేసి తొమ్మిదో రికార్డును సృష్టించారు.