: ఎయిర్ ఇండియాలో రూ. 225 కోట్ల భారీ కుంభకోణం... ఐబీఎం సహా పలు కంపెనీలు, అధికారులపై సీబీఐ కేసు
ఐదేళ్ల క్రితం విమానాలకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా కొనుగోలు చేసిన వేళ, రూ. 225 కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించిన సీబీఐ, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సంస్థ ఐబీఎం, జర్మనీకి చెందిన ఎస్ఏజీ సహా, ఏఐలోని గుర్తు తెలియని అధికారులపై కేసులు పెట్టింది. ఈ కుంభకోణం విషయంలో తమ వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సీవీసీ (సెంట్రల్ విజిలెన్స్ సంస్థ) పేర్కొనడంతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ ప్రారంభించింది. సాఫ్ట్ వేర్ కొనుగోలు, అందుకు నిధుల చెల్లింపు, ఆపై సర్వీసులు పొందడంలో అక్రమాలు జరిగాయని ఎయిర్ ఇండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
ఐబీఎం తదితర సంస్థలకు లబ్ధిని చేకూర్చేలా అధికారులు వ్యవహరించారని కనిపెట్టిన అధికారులు, ఎవరికి ఎటువంటి లాభం కలిగిందన్న విషయమై ఆరా తీస్తోంది. ఐపీసీలోని మోసం, కుట్ర సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ రూపొందించింది. ఏ విధమైన టెండర్లనూ పాటించకుండానే సాఫ్ట్ వేర్ కొన్నారని, కనీసం విమానయాన శాఖకు కూడా చెప్పలేదని, ప్రతిపాదన వచ్చిన గంటల్లోనే బోర్డు దాన్ని ఆమోదించిందని సీబీఐ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మరో ఐటీ సంస్థ ఒరాకిల్ తయారు చేసిన సాఫ్ట్ వేర్ వాడుతూనే, కొత్త సాఫ్ట్ వేర్ ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందన్న విషయానికి ఎయిర్ ఇండియా వివరణ ఇవ్వలేదని, ఆపై ఇదే సాఫ్ట్ వేర్ ను పలు ఎయిర్ లైన్స్ చాలా తక్కువ ధరకు కొన్నాయని సీబీఐ గుర్తించినట్టు తెలుస్తోంది.