: జీవితానుభవాలతో తీసే సినిమా ప్రభావం బాగా ఉంటుంది: నటుడు ప్రకాష్ రాజ్
జీవితానుభవాలతో ప్రభావితమై సినిమా తీస్తే, దాని ప్రభావం ప్రేక్షకుల మీద చాలా ఉంటుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ నెల 14న విడుదల కానున్న ‘శతమానం భవతి’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, జీవితం నేర్పిన అనుభవాల ప్రభావంతో సినిమా తీస్తే బాగుంటుందని, అబద్ధాలతో సినిమా తీస్తే ప్రేక్షకులపై ప్రభావం చూపడానికి చాలా కష్టపడాలని అన్నారు.
‘పిల్లలు మన ఆస్తులకు వారసులు కాదు .. మన విలువలకు వారసులవ్వాలి’ అనే విషయాన్ని తెలియజెప్పే చిత్రమే ‘శతమానం భవతి’ అని ప్రకాష్ అన్నారు. ఈ విషయం తెలియని వాళ్లు తెలుసుకుంటారని, ఈ చిత్రంలో ‘ప్రకాష్ రాజ్ బాగా నటించాడు’ అని కాకుండా, ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారని ప్రేక్షకులు అనుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.