: చంద్రబాబు, కరవు కవల పిల్లలు!: రోజా విమర్శలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోందని... దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ నానా హడావుడి చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు, కరవు కవల పిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోందని అన్నారు.
దివంగత రాజశేఖర్ రెడ్డి 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి... అందతా తన గొప్పే అని చెప్పుకోవడం చంద్రబాబుకే దక్కిందని దుయ్యబట్టారు. సొంత జిల్లా సమస్యలను పరిష్కరించలేని చేతకాని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పులివెందులకు నీరు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈరోజు కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీ నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.