: బాలికను దొంగగా చిత్రీకరించి ... అమానుషంగా ప్రవర్తించిన ప్రయాణికులు!


ఒక పేద బాలికను దొంగగా చిత్రీకరించి, ఆపై ఆమె జుట్టును కత్తిరించిన అమానవీయ సంఘటన హౌరా-జోథ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో చోటుచేసుకుంది. ఫిరోజాబాద్, తుండ్ల స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఏసీ 3-టైర్ కంపార్టుమెంట్ వద్ద ఓ బాలిక చేతిలో సంచితో అటూ ఇటూ తిరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణికులు ఆ బాలికను దొంగగా భావించారు. ఈ క్రమంలో ఆమె దుస్తులు విప్పి సోదా చేయడమే కాకుండా, ఆమె తల జుట్టు కూడా కత్తిరించారు. ఇదంతా గమనిస్తున్న టీటీఈ ఎస్ కే శర్మ అక్కడికి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

బాలికపై దాడి చేయవద్దని, పోలీసులకు అప్పగించాలని ఆయన చెప్పిన మాటలను ప్రయాణికులు పట్టించుకోలేదు. పైగా, ఆ బాలికకు వత్తాసు పలుకుతున్నాడని, దొంగతో కుమ్మక్కయ్యాడని తిడుతూ తనపై కూడా ప్రయాణికులు మండిపడ్డారని టీటీఈ శర్మ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేద బాలికపై ప్రయాణికులు అమానుషంగా ప్రవర్తించడం తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, మరోపక్క ఈ సంఘటనపై రైల్వే పోలీసులకు ప్రయాణికులు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ సంఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ, తన కుమార్తె మానసిక స్థితి సరిగా లేదని, ఆమె మెదడులో కణితి ఉందని, ఏడాదిగా చికిత్స చేయిస్తున్నామని చెప్పారు. ఆదివారం నాటి  జాతరకు వెళ్లేందుకు డబ్బులు కావాలని తమను అడిగిందని, అందుకు తాము అంగీకరించకపోవడంతో.. అలిగిన తమ కూతురు బయటకు వెళ్లిపోయిందన్నారు. పాఠశాల సర్టిఫికెట్ ప్రకారం తమ కూతురు వయసు 17 సంవత్సరాల 10 నెలలు అని, పోలీసులు మాత్రం 19 సంవత్సరాలుగా నమోదు చేసుకుని, తమ కూతురుని జైల్లో పెట్టారని వాపోయారు.

  • Loading...

More Telugu News