: సోమిరెడ్డి ఆస్తులపై సమగ్రస్థాయిలో దర్యాప్తు జరపలేదు.. ఫోర్జరీ డాక్యుమెంట్లని అంటున్నారు: కాకాని
టీడీపీ నేత సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ వైసీపీ నేత కాకాని గోవర్ధన్‌రెడ్డి మీడియా ముందు ఉంచిన డాక్యుమెంట్లు అన్నీ నకిలీవేనని, అవి సృష్టించినవేనని ఈ రోజు నెల్లూరులో ఆ జిల్లా ఎస్పీ విశాల్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సోమిరెడ్డిపై తాను చేసిన ఆరోపణలపై సరయిన దర్యాప్తు జరపలేదని అన్నారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్లు చేశారని పోలీసులు మీడియా ముందు ఏవేవో చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే సోమిరెడ్డి ఆస్తుల విషయాన్ని నీరు గార్చాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
ఈడీతో విచారణ జరిపించేందుకు ఎందుకు సిద్ధపడడం లేదని కాకాని ప్రశ్నించారు. తాను చూపించిన డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లని ప్రభుత్వ నేతలు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమిరెడ్డి ఆస్తులపై నిజానిజాలు తేల్చడంలేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో కోర్టులో విచారణ జరిపించి చర్యలు తీసుకోమని మళ్లీ కోరుతామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి దాడులకు దిగినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు సోమిరెడ్డిని కూడా తప్పించాలని చూస్తోందని ఆరోపించారు. ఆయనకు ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్న దానిపై విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తామని చెప్పారు. ఓ పథకం ప్రకారమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత స్థాయిలో విచారణ జరపకుండా ఫోర్జరీ అన్న పేరుతో కేసును మూయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.