: పోలీసులా? మజాకా?...చివర్లో లైట్ తీస్కో అనేశారు!
మీ భద్రతకు మాదీ భరోసా అంటూ పోలీసులు స్లోగన్స్ ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాదు మహానగరంలో సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ఎవరైనా ఇల్లు వదిలి వెళ్తే తమకు సమాచారమిస్తే ఓ కన్నేసి ఉంచుతామని పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వనస్థలిపురంలో ఓ వ్యక్తి తాను ఊరెళ్తున్నానని, నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న తన ఇంటిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులను కోరాడు. అనంతరం ఎందుకైనా మంచిదని భావించి, తన ఇంటి తాళం చెవులు కూడా పోలీసుల చేతుల్లో పెట్టాడు. దీనిని మంచి అవకాశంగా భావించిన పోలీసులు, ఆ ఇంటిని రెస్ట్ హౌస్ గా మార్చేశారు. మద్యం బాటిళ్లు, మాంసాహారంతో ఆ ఇంట ప్రవేశించి పార్టీ చేసుకున్నారు. అయితే వెళ్లిన పని అయిపోవడంతో ఆయన తన ఇంటికి వచ్చి పోలీసులను చూసి షాక్ తిన్నాడు. మంచి పార్టీలో ఉండగా వచ్చిన ఇంటి యజమానిని చూసిన కానిస్టేబుళ్లు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి ఇదేంటని ప్రశ్నించడంతో 'లైట్ తీసుకో'మని చెప్పి వెళ్లిపోయారు.