: ఎవడయ్యా వాడు శ్రీకాంత్ రెడ్డి... నా గురించి మాట్లాడతాడా?: జేసీ
నోటికొచ్చినట్టు మాట్లాడితే తన నాలుక కోస్తానని చెప్పిన రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు" అంటూ నిప్పులు చెరిగారు. ఎవడో చెప్పిన మాటలు విని, నన్నే కామెంట్ చేస్తావా? అంటూ మండిపడ్డారు.
కడప జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగసభలో మాట్లాడుతూ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఫైర్ అయ్యారు. తనను జానీవాకర్ రెడ్డి అంటూ శ్రీకాంత్ రెడ్డి కామెంట్ చేయడంపై స్పందిస్తూ... మద్యం తాగడం తమ ఇంటావంటా లేదని చెప్పారు. తన గురించి మాట్లాడిన వారే జానీవాకర్లు అంటూ మండిపడ్డారు. తనకు బూట్లు నాకే అలవాటు లేదని... ఆ అలవాటు ఉంటే మంత్రి పదవిలో కొనసాగుతూనే ఉండేవాడినని జేసీ అన్నారు. అనుభవం లేని వాడు కూడా తనను విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. 'నా నాలుక కోస్తావా... అంత దమ్ముందా నీకు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.