chandrababu: నన్ను చెప్పుతో కొట్టాలి అన్నారు.. బంగాళాఖాతంలో పడేస్తామన్నారు!: సీఎం చంద్రబాబు
ఈ రోజు కడప జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఎంతో కష్టపడి రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుపుతున్న తమపై వైసీపీ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. పులివెందులను దేశానికే ఆదర్శంగా మారుస్తోంటే వైసీపీ నేతలు మాత్రం తనను చెప్పుతో కొట్టాలని అంటున్నారని అన్నారు. తనను బంగాళాఖాతంలో పడేస్తామన్నారని చంద్రబాబు అన్నారు.
తనను వైసీపీ నేతలు ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో తాను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశానని ఎంతో అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు. పోలవరం పట్టిసీమ వంటి కలలు నిజం అవుతుండడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. స్వార్థం కోసం రాజకీయాలు వద్దని హితవు చెప్పారు. పులివెందులకు నీళ్లివ్వడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాలు చేయాలని అన్నారు.