chandrababu: ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు: కడపలో చంద్రబాబు
రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీరు విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. ఈ రోజు తన జీవితంలో మరచిపోలేని రోజని చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఓ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని అన్నారు. రాయలసీమలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీని తాను మాత్రమే గట్టెక్కించగలనని, ఈ కష్టకాలంలో తాను తప్పా వేరెవ్వరూ రాష్ట్రాన్ని గట్టెక్కించలేరనే ఉద్దేశంతోనే తనకు ప్రజలు ఓట్లు వేశారని ఆయన అన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. తమ పార్టీ రాష్ట్రంలో గెలిచిన వెంటనే తాను ఢిల్లీకి వెళ్లి పోలవరం ప్రాజెక్టుపై చర్చించానని చెప్పారు. పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఏపీలో కలపాలని అడిగానని, లేదంటే తాను ప్రమాణ స్వీకారం చేయనని, తనకి ఈ పదవి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వంతో అన్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చివరికి ఆ ఏడుమండలాలను ఏపీలో కలిపారని, లేదంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోయేవని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కరవు అనే సమస్యే ఉండబోదని చెప్పారు.