: ఒబామా చివరి ప్రసంగం ముగియగానే, ట్రంప్ తొలి మీడియా సమావేశం!
అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్న ఒబామా, జాతిని ఉద్దేశించి చివరిగా ప్రసంగించిన మరుసటి రోజే కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి మీడియా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇంతవరకూ మీడియాతో మాట్లాడని ట్రంప్, నేడు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వనున్నారని ప్రకటన వెలువడింది. తన వ్యాపార నిర్వహణ బదిలీ, దేశ భవిష్యత్తుపై తన నిర్ణయాలు ఎలా ఉంటాయి? అమెరికా వృద్ధి కొనసాగేలా తన పాలన ఎలా సాగుతుందన్న విషయమై ఆయన మాట్లాడతారని వైట్ హౌస్ కు కాబోయే ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ వెల్లడించారు.
కాగా, ట్రంప్ తొలి సమావేశం కోసం దేశ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో ఎన్నికలు ముగిసిన తరువాత ఆనవాయితీగా వచ్చే మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను సైతం ట్రంప్ నిర్వహించలేదన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ చేపట్టిన ర్యాలీల్లో మాట్లాడినా, జర్నలిస్టులతో పెద్దగా కలవలేదు ట్రంప్. ఇక ఒబామా చివరి ప్రసంగం ముగియగానే, ట్రంప్ నుంచి మీడియాకు ఆహ్వానం రావడం గమనార్హం.