: రివ్యూ వచ్చేసింది.. చిరు అభిమానులకు పండగే.. 'ఖైదీ'కి పాజిటివ్ టాక్!
భారీ అంచనాలతో ప్రేక్షకుల మధ్యకు వచ్చిన చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నంబర్ 150'కి రివ్యూలు వచ్చేశాయి. తమిళ చిత్రం కత్తికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తనలో సత్తా కొంచెం కూడా తగ్గలేదని ఈ సినిమాతో చిరంజీవి నిరూపించుకున్నాడు. డ్యాన్స్‌లు, ఫైట్లతో దుమ్మురేపాడు. ద్విపాత్రాభినయం చేసిన చిరు కోల్‌కతా సెంట్రల్ జైల్లో కత్తి శీనుగా కనిపించడంతో సినిమా మొదలవుతుంది.
జైలు నుంచి తప్పించుకున్న శీను (చిరంజీవి) హైదరాబాద్ వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్లాలనుకున్న శీను హైదరాబాద్‌లో లక్ష్మి (కాజల్)ని చూసి బ్యాంకాక్ ఊసు మర్చిపోతాడు. అదే సమయంలో తనలా ఉన్న శంకర్ (చిరు ద్విపాత్రాభినయం)పై హత్యాయత్నం జరుగుతుంది. అతడు తనలా ఉండడంతో ఆశ్చర్యపోయిన శీను అతడిని కాపాడి ఆస్పత్రిలో చేరుస్తాడు. తర్వాత అతడు రైతు నాయకుడు అని తెలుసుకుంటాడు. శీను మళ్లీ బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కత్తి శీనును శంకర్‌గా పొరపాటుపడిన కలెక్టర్ అతడిని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు.
రైతుల భూమిల్ని కాజేసి అక్కడ కూల్‌డ్రింక్స్ ఉత్పత్తి కంపెనీ పెట్టాలనుకుంటున్న అగర్వాల్ (తరుణ్ అరోరా) కత్తి శీనును శంకర్‌గా భావించి రైతుల భూములను తనకిచ్చేలా ఒప్పిస్తే రూ.25 కోట్లు ఇస్తానని ఆశ చూపుతాడు. దీనికి శీను సరేనంటాడు. అయితే శంకర్ గురించి పూర్తిగా తెలుసుకున్న శీను రైతుల కోసం అతడు తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన విషయం తెలుసుకుని అగర్వాల్ కుట్రలకు చెక్ చెబుతూ రైతుల పక్షాన నిలుస్తాడు. స్థూలంగా 'ఖైదీ' కథ ఇది.
సినిమా రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించారు. పాటలు, ఫైట్లు అదుర్స్. 'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు', 'రత్తాలు', 'సన్నజాజిలా పుట్టేసిందిరో.. మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా అమ్మడు సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లు అభిమానుల కేరింతలతో మార్మోగిపోయాయి.