: ఏబీసీలకు కొత్త అర్థం చెప్పిన మాజీ ఎంపీ తరుణ్ విజయ్
మాజీ ఎంపీ తరుణ్ విజయ్ ఏబీసీలకు కొత్త అర్థం చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ పుస్తక ప్రదర్శనలో సైబర్ పాఠశాల పేరుతో ఆయన రచించిన పుస్తకాన్ని మంగళవారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆవిష్కరించారు. నేటితరం చిన్నారులకు సైబర్ ప్రపంచం, దాని భద్రత గురించి తెలియజేయడమే లక్ష్యంగా వచ్చిన ఈ పుస్తకంలో ఎ ఫర్ ఏటీఎం, బి ఫర్ భీమ్, సి ఫర్ క్యాష్‌లెస్, డి ఫర్ డీమోనిటైజేషన్ అంటూ కొత్త అర్థాలు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు పిల్లల పుస్తకాల్లో సి అంటే కౌ అని ఉండేదని, ఇకపై సి అంటే క్యాష్‌లెస్ అని ప్రజలు చెబుతారని అన్నారు. పుస్తకంలోని హెచ్ అక్షరం నిజాయతీ(ఆనెస్ట్)ను తెలుపుతోందని అన్నారు. అంతర్జాతీయ సైబర్ నిపుణులు సమీర్ చంద్ర(వర్జీనియా), ఎంఎస్ విద్య(బెంగళూరు), చిన్ను సెంథిల్ కుమార్(చెన్నై), రాజేశ్ కల్రా(టైమ్స్ ఆఫ్ ఇండియా) సహకారంతో ఈ పదాలను సమకూర్చారు.