: ఆ పాటకు కాలు కదిపాక.. 'నో... మనమేం తగ్గలేదు' అనిపించింది!: చిరంజీవి
సుదీర్ఘ విరామం తరువాత సినిమా సెట్లో అడుగుపెట్టిన తరువాత డాన్స్ చెయ్యగలనా? లేదా? అనే అనుమానం వచ్చిందని చిరంజీవి తెలిపారు. అలాగే వయసు పైబడుతోంది.. హీరోయిన్ గా కాజల్ అందరు యువహీరోలతో నటిస్తోంది.. మన మేకోవర్ సరిపోతుందా?... ఇలాంటి అనుమానాలు రేగాయని ఆయన అన్నారు. అయితే యూనిట్ కొన్ని ఫోటోలు విడుదల చేసిన తరువాత, తొలి రోజు 'రత్తాలు రత్తాలు' పాట చిత్రీకరణ కోసం డైరెక్టర్ యాక్షన్ అనగానే, బాడీ కదిలిన తరువాత తొలిసారి.... 'నో మనమేం తగ్గలేదు' అనిపించిందని చిరంజీవి చెప్పారు. పదేళ్ల విరామం ఎన్నో మార్పులు తెచ్చి ఉంటుందని భావించానని, అయితే అలాంటిదేమీ జరగలేదని, కాజల్ తో సరిగ్గానే కనిపించానని, ఈ తరం ప్రతినిధులకు సమానంగా కాళ్లు కదిపి డాన్స్ చేశానని ఆయన తెలిపారు. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అనంతరం ఆయన సినిమా విజయవంతమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.